Friday, June 19, 2009

చిత్రమైన భావనలు

భావస్వారూప్యత బహు నిండుగా ఉన్న మీ కవితలు చదివేకొద్దీ నాలో చిత్రమైన భావనలు కలుగుతున్నాయి...
చదవడానికి ఉపక్రమించే ముందు, ఆడుకోవటానికి అనుమతి పొందిన పసిమనసువలె, నా మది ఉప్పొంగుతుంది...
చదువుతున్నంతసేపు, ఆ పదకవితాకాసాన్న పయనిస్తున్న స్వేచ్చావిహంగంవలె, నా దేహం విహరిస్తుంది...
చదవటం ముగిసిన వేళ, అంతిమాధ్యాయానికి చేరువోతున్న ముదసలి అసువువలె, నా ఎద ఆరాటపడుతుంది...

(యామిని గారి కవితలకి ప్రభావితమై వ్రాసిన మలి కవిత)

బాటసారి

జీవితమనే శాస్త్రంలో మునిగి తేలిన శాస్త్రవేత్త ఆ వేమన యోగి...
శాస్త్రానికి జీవితానికి నడుమ నలుగుతున్న ఓ బాటసారి ఈ మానవ జీవి...
పల్లెసీమ అందాలకు నోచుకోని పట్టణవాసికి పచ్చని చేను కూడా నందన వనంలానే ఉంటుంది...
ప్రవంచీకరణ మత్తులో జోగుతున్న ప్రజానికానికి తేట తెనుగు కూడా కమ్మని కవితలానే ఉంటుంది...

(నేను సైంటిస్టా లేక వేమన యోగా, అని ప్రశ్నిస్తూ, నా తెలుగు భాషా ప్రావిణ్యాన్ని మెచ్చుకున్న ఓ అభిమానికి ఇచ్చిన బదులు)

విశ్వదాభిరామ వినుర యామ

తెనాలి వారి నోట జారిన మాట, జాలువారే తీయని తేనెల మూట...
పదాలు చూడ పరవశింపు, తాత్పర్యము వెదక తాత్త్వికత ఉట్టిపడు...
ఓ విశ్వదాభిరామ వినుర యామ...

(యామిని గారి కవితలకి ప్రభావితమై వ్రాసిన మలి కవిత)

మధురానుభూతి

మీ రుచిలోని షట్రుచులు, నసలోని పదనిసలు, కడదాకా నేస్తం కోసం చీయందించే మీ స్నేహ బంధనాలు,
ఎండలో మాడిన మాడుని చల్లార్చిన లేలేతని కొబ్బరినీరు వలె,
చలిలో బిగిసిన చేతులని చుంబించిన వెచ్చని మంటల సెగ వలె,
పగలంతా కష్టించిన శ్రమజీవిని ఓదార్చిన సాయం సంధ్య వలె,
రేయంతా నిట్టూర్చిన హృదయానికి జీవమిచ్చిన రవికిరణం వలె,
ఒక్కసారి నాలో కలిగిన ఈ మధురానుభూతులతో, మీ బ్లాగుని వీడలేక, వీడుకోలు చెప్పలేక, సెలవు మాత్రం తీసుకుంటున్న మీ అభిమాని...

(యామిని గారి కవితలకి ప్రభావితమై వ్రాసిన మలి కవిత)

భావావేశం

సంధ్యారాగపు రవికిరణంలా,
నింగిని తాకిన గువ్వల కిలకిలరావంలా,
తుమ్మెదకై వికసించిన సీతమ్మవారిజడబంతిలా,
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి సుమధుర పదజాలంలా,
నాలో దాగిన భావావేశాన్ని వెలికి తీసిన ఓ అభినవ కవయత్రీ, మీకు ఇవే నా అభివందనాలు...

(యామిని గారి కవితలకి ప్రభావితమై వ్రాసిన తొలి కవిత)

When emotions become expressions...

ఈ సాగరాన్న నిండి ఉన్న జ్ఞాపకాల కడలిలోన ఎదను వదిలి పయనమైతి
ఆ జ్ఞాపకాలే మదిని పిండి గుండె లేని బతుకులోన ప్రేమ నింపి ప్రాణమైతి
ఏ దినాన్న మరపురాని నాటి గురుతులన్నీ నేటి గుండెలోన మోయలేని భారమవునో
ఆ క్షణాన్న సంద్రమైన మనసులోన పొంగుతున్న భావరచన మధురమైన కవనమవును


(నా తొలి తెలుగు కవిత... సంద్రంతో బంధం పెనవేసుకున్న నాకు, ఆ జ్ఞాపికల అల్లికలు పలికించిన పలుకులు)